Congress MP KVP: ప్రధాని మోదీపై విమర్శలు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి కేవీపీ విజ్ఞప్తి
ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP) లేఖలు రాశారు. ఢిల్లీలో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీ మాట్లాడుతూ.. ఆ లేఖల్లోని సారాంశాన్ని వెల్లడించారు.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP Ramachandra Rao) లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పొందుపర్చిన అంశాలతో పాటు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, హక్కుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కేవీపీ తన లేఖ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. ఢిల్లీలో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీ మాట్లాడుతూ.. విభజన హామీల కోసం తాను రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం పెట్టానని, గత శుక్రవారం మార్చి 6న ఆ తీర్మానాన్ని రాజ్యసభ బిజినెస్‌లో చూపించి చర్చించకుండానే ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై (Special status to AP) కేంద్రం మాటమార్చి ప్రజల్ని నిలువునా మోసగించిందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ సైతం కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు.
చంద్రబాబు సర్కార్‌పైనా విమర్శలు..
జగన్ కంటే ముందు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సర్కార్ సైతం విభజన హామీలను సాధించుకోవడంలో విఫలమైందని అన్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తరపున అందించే ప్రాయోజిత పథకాల్లో 90% నిధులు ఇస్తారని.. కానీ రాష్ట్రానికి హోదా లేకపోవడం వల్ల 60 శాతం మాత్రమే కేంద్రం భరిస్తోందని చెప్పుకొచ్చారు. హోదా కారణంగా నష్టపోతున్న ఆ 30% నిధులను కూడా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ నిధులను ఇవ్వనేలేదని తెలిపారు. ఆ లెక్క ప్రకారం కేంద్రం నుంచి మొత్తం రూ. 27,571 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని గణాంకాలతో సహా వివరించారు. పారిశ్రామిక పన్ను రాయితీలు, బుందేల్ ఖండ్‌కి ఇస్తోన్న తరహాలో వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీలు సహా విభజన చట్టంలో పొందుపర్చిన అనేక హామీలను కేంద్రం నిలబెట్టుకోవాల్సి ఉందని కేవీపీ అభిప్రాయపడ్డారు.
కేవీపీ ప్రెస్ మీట్‌లోని ముఖ్యాంశాలు:
2014 ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ.. అప్పుడు తిరుమల వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాలను మర్చిపోయారని ఆరోపించారు.
కొత్తగా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు.. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలనే అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ మెట్లకు నమస్కరించడం చూసి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి అని భావించాను. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆయన తుంగలో తొక్కుతారని అనుకోలేదని కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టునైనా చిత్తశుద్ధితో పూర్తిచేయాలి. ప్రాజెక్టు కోసం అవసరం అయ్యే నిధులను రుణాల కింద కాకుండా నేరుగా కేటాయేంచాలని కేవీపీ డిమాండ్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..