Longest goods train named as Trishul, video: విజయవాడ: మీరు రైల్వే స్టేషన్‌కి వెళ్లినప్పుడో లేక రైలు పట్టాల వైపు వెళ్లినప్పుడో అక్కడి నుంచి గూడ్స్ రైలు వెళ్లడం చూసే ఉంటారు. మామూలుగానే గూడ్స్ రైలు చాలా పొడవుగా ఉంటుంటాయి. ఒక్క గూడ్స్ రైలు మన ముందు నుంచి క్రాస్ అవడానికే చాలా సమయం పట్టినట్టు అనిపిస్తుంటుంది. అలాంటిది మూడు గూడ్స్ రైళ్లను ఒక దాని వెనక ఒకటిగా అనుసంధానిస్తే.. చూడ్డానికి ఆ రైలు ఇంకెంత పొడవుగా ఉంటుందో ఊహించుకోండి! అలాంటి రైలు మన ముందు నుంచి పూర్తిగా క్రాస్ అవడానికి ఇంకెంత సమయం పడుతుందో ఊహించుకోగలరా ? ఏంటి ఊహకు అందడం లేదా ? అయితే ఇదిగో ముందుగా అనకొండ లాంటి ఆ రైలు వీడియో చూడండి.. ఆ తర్వాత ఆ రైలు విశేషాలు ఏంటో తెలుసుకుందాం.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


పొడవాటి గూడ్స్ రైలు (Long haul trains) వీడియో చూశారు కదా.. సాధారణంగా అయితే, ఒక గూడ్స్ రైలు సగటున 58 బోగీలతో 800 మీటర్ల పొడవుతో ఉంటుంది. అయితే, గూడ్స్‌ రైళ్ల వల్ల ప్యాసింజర్ ట్రెయిన్స్‌కి ఎదురవుతున్న ట్రాఫిక్‌ సమస్యలను నివారించడానికి ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తోన్న ఇండియన్ రైల్వే తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తాజాగా మూడు గూడ్స్‌ రైళ్లను కలిపి ఒకే రైలులా (Three trains clubbed as single train) నడిపితే ఎలా ఉంటుందనేది ప్రయోగాత్మకంగా చెక్ చేసి చూసింది దక్షిణ మధ్య రైల్వే. 


దక్షిణ మధ్య రైల్వే (South Central Railways - SCR) సూచనల మేరకు విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు మూడు రైళ్లను కలిపి ఓ పొడవైన గూడ్స్ రైలును పట్టాలెక్కించారు. ఈ సూపర్‌ రైలు పేరే త్రిశూల్. ఈ రైలులో 174 వ్యాగన్లు అమర్చారు. ట్రైన్‌ ముందు భాగంలో రెండు, మధ్యలో రెండు, చివర్లో వచ్చే మూడో రైలుకు ముందు భాగంలో మరో రెండు చొప్పున మొత్తం ఆరు ఇంజన్లను ఏర్పాటు చేసి ఈ త్రిశూల్ రైలును ప్రయోగాత్మకంగా విజయవాడ - దువ్వాడ స్టేషన్ల మధ్య నడిపించారు.


త్రిశూల్ గూడ్స్ రైలు (Trishul goods train) మొత్తం పొడవు 2.40 కిలోమీటర్లు. ఈ గూడ్స్‌ రైలు 50 కిలోమీటర్ల వేగంతో నడిచింది రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య తెలిపారు. ఈ ప్రయోగానికి కృషి చేసిన విజయవాడ డివిజన్ రైల్వే అధికారులను మాల్య అభినందించారు. మూడు రైళ్లను ఒక్కటి చేసి నడపడం వల్ల సిబ్బంది సంఖ్య కొంతవరకు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు సైతం చెక్ పెట్టవచ్చని ఇండియన్ రైల్వే (Indian Railways) భావిస్తోంది.