అమరావతి : ఏపీ సర్కార్‌తో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బృందం సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. దిశా యాక్ట్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికే తాము ఇక్కడికి వచ్చామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశా యాక్ట్ తీసుకొచ్చి మహిళలపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరితలకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అభినందనలు తెలిపారు. మహారాష్ట్రలో కూడా త్వరలోనే ఇదే విధమైన చట్టాన్ని రూపొందిస్తామని ఈ సందర్భంగా అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టంచేశారు.


మహారాష్ట్ర నుండి వచ్చిన ప్రతినిధుల బృందంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్, మహరాష్ట్ర డీజీపీ సుబోత్ కుమార్ జైస్వాల్, మహారాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శితో పాటు మరో ఇద్దరు సీనియర్ IPS అధికారులు ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఏపీ మహిళా శిశు సంరక్షణ శాఖ మంత్రి తానేటి వనిత, రాష్ట్ర ప్రధాన కార్యయదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, దిశ స్పెషల్ ఆఫీసర్ ఈ భేటీలో పాల్గొన్నట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..