టాప్ -10 ఏపీ పర్యాటక ప్రాంతాలు..
పర్యాటక ప్రదేశాలకు పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం . ఇక్కడ ఉన్న అందచందాలను చూసిన ప్రకృతి ప్రేమికలు ఈ ప్రదేశాన్ని కోహినూర్ ఆఫ్ ఇండియాగా పేరుపెట్టారు. ప్రఖ్యాతి గాంచిన ఈ నేలపై ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకు పుట్టిల్లు. ప్రకృతి ప్రేమికులు ఈ ప్రదేశాన్ని కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ ఫ్యామిలీతో పాటు పర్యటించాల్సిన ప్రాంతాలు అనేకం. తిరుపతి, ద్వారక తిరుమల, శ్రీశైలం, శ్రీ కాళహస్తి, సింహాచలం, అన్నవరం, అహొబిలం, మహానంది, కానిపాకం, విజయవాడ దుర్గ గుడి మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. విశాఖపట్నం, పేరిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం వంటి ఎన్నో బీచ్ లు ఉన్నాయి. అరకు లోయ, బొర్రా గుహలు, పాపి కొండలు, లంబసింగి వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి.
అరకు అందాలు....
ఏపీ టూరిజం అనగానే ప్రధానంగా వినిపించే పేరు 'అరకు లోయ'..దీన్ని ఆంధ్ర ఊటీగా పిలుస్తుంటారు. అరుకు అందాలను చూసిన వారు..దీన్ని భూలోక స్వర్గంగా వర్ణిస్తుంటారు. కాగా అరకు ప్రాంతం విశాఖపట్నం జిల్లా, డుంబ్రిగుడ మండలానికి చెందిన గ్రామము. ఈ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణం, కొండలు,లోయలతో జానాలను తెగ ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది. అరకు వెళ్ళే ఇరువైపులా దట్టమైన అడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండలలో కాఫీ తోటలు ఉన్నాయి. 29 కి.మీ. దూరములో ఉన్న బొర్రా గుహలు ఒక పర్యాటక ఆకర్షణ. తూర్పు కనుమలులో ఉన్న ట్రైబల్ మ్యూజియమ్ ఇంకొక ఆకర్షణ.
తిరుమల పుణ్యక్షేత్రం......
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. శ్రీ వెంటశ్వర ఆలయంలో పాటు తిరుపతి పట్టణంలో గోవిందరాజ స్వామి దేవాలయం,కోదండ రామాలయం, కపిలతీర్థం, వరదరాజ స్వామి దేవాలయం, జీవకోన, ఇస్కాన్ దేవాలయం లాంటి ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. వీటితో పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు, చంద్రగిరి కోట, హార్సలి హిల్స్, తలకోన, కళ్యాణి ఆనకట్ట, శ్రీ శుకబ్రహ్మశ్రమమం, నారాయణవనం తిరుపతి చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు. తిరుపతి నగరానికి విమాన, రైలు, రహదారి సౌకర్యాలు ఉన్నాయి. ఈ నగరం విజయవాడకు 349 కి.మీ, హైదరాబాదుకు 550 కి.మీ, బెంగళూరుకు 256 కి.మీ., చెన్నైకు 140 కి.మీ దూరంలో ఉంది.
శ్రీశైల శైవ క్షేత్రం...
శ్రీశైలం.. కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ ఉంటుంది. అలాగే నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ఉంది. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు ఉన్నాయి. చూపులకు కానరానంతగా విస్తరించుకొన్న శ్రీశైలము క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి : శ్రీశైల దేవాలయ ప్రాంతము, సున్నిపెంట ప్రాంతము, మండపాలు, పంచమఠాల ప్రాంతము, అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు.
లేపాక్షి దర్శనం....
లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్య యుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ కూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తువరకు పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది. ఈ చారిత్రాక ప్రదేశం బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 16 కి.మీ. దూరంలో ఉంటుంది.
మంత్రాలయము....
మంత్రాలయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు ఉన్నాయి. ఇక్కడ ప్రతి గురువారం సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
పాపి కొండలు...
పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ, మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా లను ఆనుకొని ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి 410 కిలోమీటర్ల దూరంలోను, ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది.
పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.
పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి.
పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.రాజమండ్రి నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభవం.
పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడినుండి పోలవరం, రాజమండ్రి, కూనవరం, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.
శ్రీకాళహస్తి...
శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము మరియు ఒక మండలము. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.
బెజవాడ కనకదుర్గమ్మగుడి...
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో బెజవాడ కనకదుర్గమ్మ ఆయలం ఒకటి. అఖిలాంధ్రకోటి బ్రహ్మండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రిమీద కొలువై భక్తుల కోరికలు కోరించే తడవుగా వారి కొరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ , ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి. ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక శ్రీ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి.
అహోబిలం...
అహోబిలం, కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది.
విశాఖపట్నం...
విశాఖ టూరీజానికి రాజధానిగా పిలుస్తారు. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. "డాల్ఫిన్స్ నోస్" అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌గా పనిచేస్తుంది. వీటితో పాటు ఇందిరాగాంధీ నేషనల్ జూవలాజికల్ పార్క్, కైలసగిరి, వరాహ లక్ష్మీనరసింహ టెంపుల్, శివాజీ పార్క్, ఆర్కే బీజ్, డాల్ఫిన్ నోస్, రుణికొండ బీచ్, యారడ బీచ్ తో పాటు అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి