ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ట్విట్టర్‌ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం సమర్పించిన యూసీలు సరిగా లేవని చెప్పటానికి జీవీఎల్‌ ఎవరు? అని మంత్రి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. యూసీలు సరిగా లేకపోతే కేంద్రంలోని ఆ శాఖలు వివరణ అడుగుతాయని పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన వెయ్యి కోట్ల నిధులపై యూసీలు సమర్పించామన్నారు. యూసీలకు కేంద్ర శాఖలు కూడా ఆమోదించాయని ట్వట్టర్‌లో మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


ఇప్పటి వరకు కేంద్రం అమరావతికి ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమేనని, యూసీలు రూ.1,583 కోట్లకు సమర్పిస్తే ఆమోదించారని పేర్కొన్నారు. జీవీఎల్‌ చెబుతున్న ఊహాజనిత ప్రాజెక్టుకు రూ.8,962 కోట్లు విడుదల చేశామని చెబుతున్నారని, అది ఏ ప్రాజెక్టు, దాని వివరాలు తెలపాలని, లేదంటే అబద్దమని ఒప్పుకోవాలన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చేందుకు యూసీలు అవరం లేదుకదా? అని బదులిచ్చారు. యూసీలు సమర్పించడం...ఆమోదించడం అనేది పరిపాలనలో నిత్యం జరిగే ప్రక్రియ అని తెలిపారు.