రమణదీక్షితులను జైల్లో వేయాలి: సోమిరెడ్డి
టీటీడీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: టీటీడీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మహానాడు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు శ్రీవారిని వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో అతిపెద్ద ధార్మిక సంస్థ ఏడుకొండల వేంకటేశ్వరస్వామి అని మంత్రి అన్నారు. రమణ దీక్షితులను జైల్లో పెడితే అసలు నిజాలు బయటకొస్తాయని అన్నారు. టీటీడీ వివాదంపై బీజేపీ-వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని.. రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రమణదీక్షితుల వంటి వ్యక్తుల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవారికి నాశనం తప్పదని హెచ్చరించారు.
అటు మహానాడు కార్యక్రమాలపై స్పందిస్తూ.. దేశంలో క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ టీడీపీయేనని మంత్రి అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని.. విభజన తర్వాత పరిస్థితులను మహానాడు వేదికపై వివరిస్తామన్నారు. మహానాడును మూడు రోజులపాటు విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.