విజయవాడ: ఏపీలోని మైనార్టీలకు రాష్ట్ర సర్కార్ శుభవార్త వెల్లడించింది. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. ప్రతీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే.. అందరికీ విద్య ఎంతో అవసరం. అందుకే ప్రతీ నిరుపేద మైనార్టీ విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్‌లోనే విద్యార్థులకు హాస్టల్స్‌తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గురువారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఈ వివరాలు వెల్లడించారు. 


ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనార్టీలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన వల్లే మైనార్టీల జీవన శైలిలో మార్పు వచ్చిందని, మైనార్టీలకు పెద్ద పీట వేసేలా ఆయన పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే పేద ప్రజలకు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కట్టుబడి ఉన్నారని, మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని మరోసారి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పాస్టర్లకు 5 వేలు గౌరవ వేతనం, మౌజన్‌, పేషమామ్‌లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 8 వేల నుంచి 15 వేలకు పెంచామని పేర్కొన్నారు. జెరుసలేం, హజ్ యాత్రకు వెళ్లే వారికి సైతం 3లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారికి రూ 60వేలు ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.