గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఊహించిందే జరిగింది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి తాజాగా తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోదుగుల వేణుగోపాల రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 


వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా మోదుగుల వేణుగోపాల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతోపాటు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థపూరిత రాజకీయాల కోసం, తన స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని మండిపడ్డారు. గుంటూరుకు గల్లా జయదేవ్ ఓ అతిథి లాంటి వారని చెబుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీని ఓడించి పార్టీకి బుద్ధి చెబుతామని అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను పార్టీలో ఓ సైనికుడిలా పనిచేస్తానని మోదుగుల తెలిపారు.