విశాఖ : మన్యంలో ఎమ్మెల్యే కిడారిని హతమార్చిన నిందితులు ఎవరనే విషయం తెలిసింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం లివిటిపుట్టు ఆపరేషన్ లో మావోయిస్టు నేత చలపతిదే కీలక పాత్ర అని పోలీసులు విచారణలో తేలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లివిటిపుట్టు ఆపరేషన్ లో భాగంగా గడచిన ఆదివారం నాడు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల జంట హత్యలు జరిగిన విషయంలో తెలిసిందే. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు .. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టు నేత చలపతి ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. చలపతి ఈ హత్యలో స్వయంగా పాల్గొనక పోయినా.. పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలు జరిగినట్లు సమాచారం.


రెండు నెలల మందే పక్కా స్కెచ్..
పోలీసులు కథనం ప్రకారం రెండు నెలల ముందు నుంచే వ్యూహం పన్నిన చలపతి...60 మందిని ఒక టీంగా ఏర్పాటు చేశాడు. ఈ ఆపరేషన్ కోసం కొంత మంది మావోలను ప్రత్యేకంగా ఎంపిక చేసి వారికి సాయుధ శిక్షణ, సాంకేతిక శిక్షణ కూడా ఇచ్చాడని తెలిసింది. అతని భార్య అరుణకు మొత్తం మావోల టీమ్ ను సమన్వయ పరిచే బాధ్యతలను అప్పగించాడు.


వాకీటాకీల సాయంతో సమాచారం
పోలీసుల కథనం ప్రకారం చలపతి తన సహచర మావోలకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వాకీటాకీలు ఉపయోగించినట్లు తెలిసింది. వాకీటాకీల ద్వారా ఎప్పటికప్పుడు చలపతి సూచనలు తీసుకుంటూ..60 మంది మావోలు విడివిడిగా లివిటిపుట్టు ప్రాంతానికి చేరుకున్నారు. ఘటన తరువాత 'ఆపరేషన్ సక్సెస్' అని హత్యలో పాల్గొన్న మావోలు చలపతికి చెప్పినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బెజ్జంగి అడవుల్లో వాకీటాకీ కనెక్టివిటీ పాయింట్ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు..  హత్యాకాండ ముగిసేంత వరకూ బెజ్జంగి అడవుల్లోనే ఉన్న చలపతి... ఆ తరువాత అక్కడి నుంచి నిష్క్రమించాడని కనిపెట్టారు.