కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్ యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపులను జగన్ అవమానించారని ముద్రగడ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రిజర్వేషన్లకు బదులు కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులు ఇస్తామంటూ సవతి తల్లి ప్రేమ చూపొద్దని హితవు పలికారు. కాపులను ఓట్లు అడిగే హక్కు జగన్ కోల్పోయారని ముద్రగడ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లకు మద్దతిచ్చి, తుని ఘటన తరువాత కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉందని జగన్‌ చెప్పడం దారుణమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. జగన్ ప్రస్తుతం పాదయాత్రలో ఇస్తున్న హామీలను అమలు చేయాలంటే కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కలిపినా సరిపోవని ఎద్దేవా చేశారు. కాపు కులాల వారు మీకు దాసోహంగా ఉండాలా? అని ఆయన మీడియా ముఖంగా జగన్‌ను నిలదీశారు.


మిగితా కులాలకు నష్టం కలిగించేలా కాపులకు సహాయం చేయాలని తాము ఏనాడూ కోరుకోలేదని, అంతగా సహాయం చేయాలనుకుంటే ప్రత్యేక కేటగిరీ పెట్టి కాపులకు సహాయపడాలని సూచించారు. కాపు రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం ఉందన్నారు. తమకు అండగా ఉన్నవారికే మద్దతు ఇస్తామని ముద్రగడ వెల్లడించారు.