కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో ఓ బ్యూటిషియన్‌పై గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు దుండగులు. బాధితురాలు రక్తపు మడుగులో ఒంటినిండా గాయాలతో కొట్టుమిట్టాడుతుండటం గమనించిన ఇరుగుపొరుగు వారు ఆమెని చికిత్స నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బ్యూటీషియన్‌ని పద్మ అనే యువతిగా పోలీసులు గుర్తించారు.  


పద్మకు గతంలో సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల భర్తతో విభేదాలు రావడంతో పద్మ బాపులపాడులో వేరుగా ఉంటూ హనుమాన్ జంక్షన్ లోని ఓ బ్యూటీపార్లర్ లో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే నూతన్‌ కుమార్‌ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. పద్మపై హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ దాడి వెనుకున్న వ్యక్తులు ఎరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. పద్మపై దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.