అమరావతి: జగన్ సర్కార్  ను ఎండగట్టేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా ఏమాత్రం జారవిడచకుండా ట్విట్టర్ వేదికగా విమర్శల జడివాన కురిపిస్తున్న నారా లోకేష్ ....రైతు భరోసా పథకంపై అమల్లో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపుతూ  ప్రభుత్వాన్నినిలదీశారు. రైతు భరోసా పథకంలో రైతులకు అందించే నగదులో కోత విధించారంటూ ఆరోపణాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో రైతుకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.6,500తో సరిపెడుతున్నారంటూ విమర్శించారు.  రైతు సమస్యల పట్ల వైసీపీ సర్కార్  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లోకేష్ దయ్యబట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం విమర్శలతో ఆగకుండా మరో అడుగు ముందుకేసి వైసీపీ సర్కార్ పై సైటర్ల వర్షం కురిపిస్తున్నారు లోకేష్. ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించిన నవరత్నాల్లో అప్పుడే ఒక రత్నం జారిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి..తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల్లో కోతలు విధిస్తూ ప్రజలను మోసం చేయడం ఎందుకుని సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఇంత  మాత్రం దానికి పాదయాత్రలో కూతలు కూయడం ఎందుకంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ ట్వీట్ కు ఎన్నికల సమయంలో వైసీపీ ప్రచురించిన వైఎస్ఆర్ భరోసా కర పత్రాన్ని జోడించారు.