పోలవరం గుత్తేదార్లతో నితిన్ గడ్కరి భేటీ..!
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ, జల సంఘం అధికారులతో భేటీ అనంతరం పోలవరం ప్రాజెక్టుకి పనిచేస్తున్న గుత్తేదార్లతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ, జల సంఘం అధికారులతో భేటీ అనంతరం పోలవరం ప్రాజెక్టుకి పనిచేస్తున్న గుత్తేదార్లతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకి మెయిన్ కాంట్రాక్టర్‌గా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఇప్పటి వరకు అనుకున్న సమయానికి చేయాల్సిన పనులు పూర్తిచేయని క్రమంలో ఆ పనుల బాధ్యతను నవయుగ సంస్థకు అప్పగించాలని తెలిపారు.
తాజా వార్తల ప్రకారం మరో వారం రోజుల తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులను నవయుగ సంస్థ చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వమే స్వయంగా ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించి.. పనులను కొత్త కాంట్రాక్టర్‌కి అప్పగించేందుకు టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే అప్పుడు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర జలవనరుల శాఖ ఆగ్రహాన్ని వెల్లగక్కింది. టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అలాగే పాత కాంట్రాక్టరునే కొనసాగించాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే స్వయంగా బరిలోకి దిగి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీతో మాట్లాడి నెల రోజులు గడువు ఇచ్చింది.
ఆ గడువులో పనుల వేగాన్ని పెంచాలని తెలిపింది. అయితే కేంద్రం ఆశించిన స్థాయిలో ట్రాన్స్‌ట్రాయ్ పనులను ముందుకు తీసుకువెళ్లేడంలో విఫలమైనందుకు... ఇప్పుడు మిగిలిన పనులను పూర్తి చేసే కాంట్రాక్టును పాత ధరల ప్రకారమే పూర్తి చేసి ఇచ్చేందుకు నవయుగ కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది. అయితే సబ్ కాంట్రాక్టర్‌గా ఉంటున్న నవయుగ కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుండి డైరెక్ట్ పేమెంట్ కోరుకుంటోంది.