పోలవరం అంశంపై నితిన్ గడ్కరీ స్పందన
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరితో టీడీపీ ఎంపీ మరియు కేంద్రమంత్రి సుజనా చౌదరి బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాల అంచనా మీద కేంద్ర వైఖరి ఏమిటి? పునరావాస నిధులు ఎలా అందజేయాలి? కాంట్రాక్టర్లను మార్చాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? లాంటి అంశాల మీద చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి పలు ముఖ్యమైన విషయాలను సుజనాచౌదరి మీడియాతో పంచుకున్నారు. ఇదే విషయంపై మరో వారం రోజులలో కేంద్ర, రాష్ట్రస్థాయి అధికారులు ఉన్నత స్థాయి భేటిని నిర్వహిస్తారని.. కాంట్రాక్టరు మార్పుపై సీఎం చంద్రబాబు నాయుడితో మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇదే విషయం గడ్కరి కూడా తెలియజేశారని.. త్వరలోనే పోలవరం అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావడమే కేంద్రం అభిమతమని ఆయన తెలిపారు.
అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ స్థాయిని జాయింట్ సెక్రటరీ హోదాను మార్చేందుకు గడ్కరి అంగీకారం తెలిపారని.. ఒకటి రెండు రోజులలో సీఈఓని నియమిస్తారని సుజనా చౌదరి తెలిపారు. ఇకపై ప్రాజెక్టు ఆలస్యం కాకుండా త్వరగానే నిర్ణయం తీసుకుంటామని గడ్కరి చెప్పారని సుజనా చౌదరి అన్నారు. ఇటీవలే పోలవరం సాగునీటి ప్రాజెక్టు అంచనాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కేంద్ర జల వనరుల శాఖ అదేశించింది. ఈ లేఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చేరింది. వాస్తవానికి రెండు నెలల కిందటే.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం రూ.58,000 కోట్లుగా పేర్కొంటూ రాష్ట్ర జల వనరుల శాఖ నివేదిక పంపింది. దీనిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ, తన శాఖ అధికారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆదేశించారు.