అవిశ్వాస తీర్మానం పట్ల కేంద్రం తీరుపై కాంగ్రెస్ మండిపాటు
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన కాంగ్రెస్ పార్టీ
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడేందుకు తమ పార్టీకి అత్యల్ప సమయం కేటాయించారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దేశంలో ఉన్న సమస్యలను ప్రస్తావించేందుకు మరింత సమయం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడానికి ముందే మల్లిఖార్జున ఖర్గె సభ వెలుపల ఏఎన్ఐతో మాట్లాడుతూ '130 కోట్ల మంది భారతీయుల సమస్యలను ఏకరువు పెట్టడానికి ఇంత తక్కువ సమయం ఎలా సరిపోతుంది' అని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇంత తక్కువ సమయం కేటాయించడం ఏ విధంగానూ సబబు కాదు అని మల్లిఖార్జున ఖర్గె తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ప్రతీ రాజకీయ పార్టీకి 30 నిమిషాల సమయం కేటాయించాలి అని ఈ సందర్భంగా ఖర్గే డిమాండ్ చేశారు.
అవిశ్వాస తీర్మానాన్ని ప్రశ్నోత్తరాల సమయంలా పరిగణించకూడదు అని పేర్కొన్న ఖర్గె... పార్లమెంట్‌లో సమావేశాల సమయంలోనూ తన నిరసన తెలిపారు. అధికార పార్టీ అయిన బీజేపీ 3 గంటల సమయం తీసుకుని, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కేవలం 38 నిమిషాలు కేటాయించడం ఏంటంటూ ఖర్గె కేంద్రంపై విరుచుకుపడ్డారు.