Elections 2019: స్వార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల; నామినేషన్లు షురూ
ఏపీలో స్వార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాల వారీగా నామినేషన్ల స్వీకరణకు కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి గోపాల గోపాలకృష్ణ ద్వివేది ప్రకటన విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు 11 గంటల నుంచి అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఈసీ ప్రకటించింది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన ... అలాగే ఈ నెల 27, 28న తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇటు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
* ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ
* ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన
* ఈ నెల 27,28న నామినేషన్ల ఉపసంహరణ గడువు
* ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు
పటిష్ఠభద్రత ఏర్పాట్లు
ఏపీలో ఎన్నికల నిర్వహణ కోసం 90 పారామిలటరీ కంపెనీ బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. మొత్తం నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎన్నికలు విధుల్లో పాల్గొంటారని ఈసీ తెలిపింది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రానికి 102 మంది ఎన్నికల పరిశీలనకు వస్తన్నట్లు తెలిసింది. ఐటీ శాఖతో కష్టమ్స్ శాఖ కూడా ఎన్నికల ఖర్చుపై నిఘా పెట్టనుంది. శాంతిభద్రతల విషయంలో రాజీపడవద్దని పోలీసులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలకు సహకరించండి ...
ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ను అభ్యర్ధులు తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల సంఘం కోరారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇప్పటికే వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక జనసేన, బీజేపీ కొన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించగా, కాంగ్రెస్ ఇప్పటి వరకూ అభ్యర్థులను ప్రకటించలేదు.