NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీలో దొంగతనం.. వృద్ధులకు ఇవ్వాల్సిన రూ.4 లక్షలు చోరీ
NTR Bharosa Pension Amount Bag Theft: ఆంధ్రప్రదేశ్ పింఛన్ పంపిణీలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బు దొంగతనానికి గురయ్యింది. ఈ సంఘటన ఆసక్తికరంగా మారింది.
NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతోంది. రూ.వెయ్యి పెంచి రూ.4 వేల పింఛన్‌ను సోమవారం నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా పింఛన్‌ల పంపిణీలో పాల్గొంటున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలతోపాటు జూలై నెల పింఛన్ కలిపి మొత్తం రూ.7 వేల పింఛన్‌ను అందించారు. అయితే పింఛన్‌ల పంపిణీలో చోరీ జరిగింది. పింఛన్‌లకు సంబంధించిన రూ.4 లక్షలు దొంగతనానికి గురయ్యాయి.
Also Read: NTR Bharosa Scheme: జగన్, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?
సామాజిక పింఛన్‌ల పంపిణీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కడప జిల్లా పొద్దుటూరులోని ఏడో వార్డు సచివాలయంలో మురళీమోహన్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తన వార్డు పరిధిలో పింఛన్ నగదు పంచడానికి నాలుగు లక్షల రూపాయలు డబ్బు తీసుకొని బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పాలిటెక్నిక్ కళాశాల వద్ద మురళీమోహన్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. బైక్‌పై నుంచి కింద పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
కొద్దిసేపటికి లేచి చూసేసరికి పింఛన్ నగదు ఉన్న బ్యాగు కనిపించలేదని మురళీమోహన్ వాపోయాడు. గాయాలవడంతో మురళీమోహన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. పింఛన్ డబ్బులు చోరీ విషయం తెలుసుకున్న పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటరమణ వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన మురళీమోహన్‌ను పరామర్శించి సంఘటన వివరాలు ఆరా తీశారు. అనంతరం అతడు కిందపడిన చోటును కూడా పరిశీలించారు.
ఉద్యోగిపై అనుమానాలు?
సీసీ కెమెరాలు పరిశీలించి పింఛన్ డబ్బులు దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఉద్యోగి మురళీమోహన్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి దొంగతనం జరిగిందని నాటకం ఆడుతున్నాడా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టి త్వరలోనే వాస్తవాలు బయటపెడతామని పోలీసులు, మున్సిపల్ అధికారులు తెలిపారు.
పింఛన్ల పండుగ
రాష్ట్రంలో ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తిచేసేందుకు కసరత్తు చేయగా.. దాదాపు 90 శాతం పూర్తయ్యేలా ఉంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్ర స్థాయి ఉద్యోగులు అందించారు.