టీడీపీ అవిశ్వాసానికి విపక్షాల మద్దతు, చర్చకు స్పీకర్ గ్రీన్ సిగ్నల్
లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి.
బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే వాళ్ల లేచి నిలబడాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. ఈ సందర్భంగా ఒక్క టీఆర్ఎస్ మినహా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తీర్మానానికి మద్దతు తెలిపుతూ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ తదితర పార్టీల వారు ఉన్నారు. ఎంఐఎం తరపున ఒకేఒక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడటం గమనార్హం. కాగా టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా 50 మంది సభ్యుల కంటే ఎక్కువ మంది లేచి నిలబడటంతో స్పీకర్ దీనికి ఆమోదం తెలిపారు.
దీనిపై స్పీకర్ స్పందిస్తూ అవిశ్వాసంపై చర్చ ఉంటుందని.. అయితే చర్చ ఎప్పుడన్నది తర్వలోనే నిర్ణయిస్తామన్నారు. 10 రోజుల్లోగా అవిశ్వాసంపై చర్చ చేపట్టాలన్న నిబంధనను టీఎంసీ సభ్యుడు సౌగత్ రాయ్ గుర్తు చేశారు. సభా ఆర్టర్ ప్రకారం చూస్తే శుక్రవారం రోజు అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. మరికొందరైతే సభా చివరి రెండు రోజుల్లో అవిశ్వాస తీర్మానం ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అవిశ్వాసానికి మద్దతివ్వని టీఆర్ఎస్
లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ తమకు ఆదేశాలు ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. కాగా ఎంఐఎం తరపున ఒకేఒక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడటం గమనార్హం.