ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ అబద్ధాలకోరని.. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో సెంట్రలైజ్డ్ దోపిడీ జరుగుతుందని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల పెట్టుబడులు, ఇండస్ట్రీ హబ్స్ అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పడు ఎందుకు మాట్లాడడం లేదని.. అక్రమాలు చేయడమే తెలుగు దేశం పార్టీ పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన గౌతంరెడ్డి ఎన్నికలు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు గంగిరెద్దు వేషాలు వేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు గమనిస్తున్నారని.. ఆయన ఆటలు సాగవని.. ఇప్పటికైనా ఆయన అక్రమాలు చేయడం మానుకొని.. ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రయత్నించాలని గౌతంరెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడికి హితవు పలికారు. 


కొన్ని నెలలక్రితమే కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన పూనూరు గౌతంరెడ్డిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించింది. గతంలో గౌతంరెడ్డి దివంగత వంగవీటి రంగాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందుకు వైఎస్సార్సీపీ పార్టీ సస్పెండ్ చేసినా.. ఆ తర్వాత మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పట్లో వంగవీటి రంగాపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. పార్టీకి వాటితో సంబంధం ఏమీలేదని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.