లోకేష్‌కు పవన్ కళ్యాణ్ `శ్రీమంతుడి` ఛాలెంజ్
శ్రీమంతుడు సినిమా చూశారా.. అందులో హీరో మహేష్ బాబు తన సొంత వూరిని బాగుచేసేందుకు సైకిల్ మీద బయలుదేరి మరీ వస్తాడు.
శ్రీమంతుడు సినిమా చూశారా.. అందులో హీరో మహేష్ బాబు తన సొంత వూరిని బాగుచేసేందుకు సైకిల్ మీద బయలుదేరి మరీ వస్తాడు. అచ్చం అలాంటి అంశాన్ని పోలిన సవాల్‌నే పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు విసిరారు. ఉత్తరాంధ్రలో ప్రజలు ఎలాంటి సమస్యలతో సతమతమవుతున్నారో తెలుసుకోవాలంటే లోకేష్ సైకిల్ యాత్ర చేయాలని పవన్ కోరారు. వీలైతే రాజధాని ఢిల్లీకి కూడా సైకిల్ మీదే వెళ్లి ఈ సమస్యలకు అక్కడి పెద్దలకు విన్నవించాలని తెలిపారు.
తన నిరసనను ఆ విధంగా తెలియజేయాలని కోరారు. ఇక విశాఖ పట్నానికి సంబంధించిన రైల్వే జోన్ విషయంపై కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. అందరూ కలిసి పోరాడితే ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఆయన తెలిపారు. అయితే తనతో పాటు చంద్రబాబు, లోకేష్, జగన్ కూడా కలిసి రావాలని తెలిపారు. అలాగే విశాఖ ప్రాంతంలో నిరసన కతావును పవన్ నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కతావు కార్యక్రమంలో భాగంగా జనసేన కార్యకర్తలు అందరూ కూడా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిందేనని కోరారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ సింహాచలం పంచగ్రామాల సమస్యపై, చిట్టివలస జూట్ మిల్లు సమస్య పై కూడా మాట్లాడారు.
అలాగే ముదపాకలో దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టిన ఘటనపై కూడా ఆయన స్పందించారు. ఇలాంటి దారుణాలు జరగకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందన్నారు. ఇఛ్చాపురం నుండి భీమిలి వరకు ఉత్తరాంధ్రలో ఉన్న అనేక సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని.. వీటన్నింటి మీదా తాను ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తానని పవన్ అన్నారు.