జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రజాయాత్రను ఈ రోజు ప్రారంభించే తరుణంలో ఉదయం తన నివాసం నుండి బయలుదేరారు. ప్రశాంత్ నగర్‌కి చెందిన కార్యాలయానికి ఆయన చేరుకున్న తర్వాత అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకొని ఆయనను స్వాగతం పలికారు. తన సతీమణి అన్నా లెజ్నెవా హారతి ఇవ్వగా.. పవన్ కారులో కొండగట్టు ప్రాంతానికి బయలుదేరారు. 

 

సహధర్మచారిణి ఎదురురాగా..

పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో తన భార్య అన్నా లెజ్నెవా హారతి ఇచ్చి, నుదుటన తిలకం దిద్ది, ఎదురురాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రకు బయలుదేరారు. 

 

ఇదే ప్లానింగ్

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి చేరుకుంటారని సమాచారం. ఈ క్రమంలో ఆయన కరీంనగర్‌కి చెందిన జనసేన కార్యకర్తలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. సోమవారం కొండగట్టు ప్రాంతంలో తన ప్రసంగాన్ని ముగించాక, మంగళవారం ఉదయం ఆయన జగిత్యాలతో తెలంగాణాకి చెందిన జనసేన ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కొత్తగూడెం ప్రాంతాన్ని సందర్శిస్తారు. బుధవారం కొత్తగూడెం నుండి ఖమ్మం బయలుదేరి వెళ్లి ఎంబీ గార్డెన్స్‌లో మళ్లీ  తెలంగాణ ప్రాంతానికి చెందిన జనసేన యువ ప్రతినిధులతో ప్రత్యేక భేటిలో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వస్తారు. 

 

జనసేన 'వీరమహిళ' ప్రారంభం

జనసేన పార్టీకి సంబంధించిన మహిళా విభాగానికి పవన్ కళ్యాణ్ 'వీర మహిళ' అని నామకరణం చేశారు. ఈ రోజు ఉదయం ఆయన ఈ విభాగానికి చెందిన సోషల్ మీడియా హేండిల్స్ ఆవిష్కరించారు. ఆ విభాగానికి చెందిన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలను ప్రారంభించారు.