Pawan Kalyan Press Meet: 'అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు కచ్చితంగా పోరాడుతామ'ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు మంగళవారం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనలో కొత్తపేట నియోజకవర్గం, అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. వర్షాల వల్ల తడిచిన ధాన్యం పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి వేదన విన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్బంగా మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "దారి పొడుగునా రైతులను కలిసాం. వారంతా చెప్పేది ఒక్కటే. మేం దోపిడీలు, దొంగతనాలు.. అవినీతి చేయలేదు. కాంట్రాక్టులు చేయలేదు. నలుగురికి అన్నం పెట్టే మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతున్నాం. ఎలాంటి సమస్యలు లేకుండా పంట కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాం అని చెప్తున్నారు. వర్షాలు రాక ముందే పంటను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు అకాల వర్షాల దెబ్బకు తీవ్ర నష్టం వాటిల్లింది. తూర్పు గోదావరి జిల్లాలో వరి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేస్తే, 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.


రాత్రికి రాత్రి గోతాలు రావడం విచిత్రం
విపక్ష పార్టీలు రైతుల కోసం గొంత్తెత్తితేగానీ ప్రభుత్వంలో చలనం లేదు. క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితిని విపక్షాలు చెబితే గానీ ధాన్యం కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇప్పటికీ ధాన్యం సేకరణ అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఇప్పటివరకు గోతాలు ఇవ్వని అధికారులు.. మేము వస్తున్నాం అని తెలియగానే రాత్రికి రాత్రి గోతాలు ఇవ్వడం విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకూ లేని గోనె సంచులు ఎక్కడి నుంచి వచ్చాయి. కొనుగోళ్లు హడావుడిగా చేస్తున్నారు. రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యం. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుంది." అన్నారు. 


రైతుల్లో భరోసా నింపేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నమన్న నాదెండ్ల మనోహర్
ఈ సందర్బంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ "అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రభుత్వం వారికి సాయపడేలా ఏమాత్రం స్పందించడం లేదు. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. రైతులకు ఏ మాత్రం ఉపయోగపడని ఈ ప్రభుత్వ విధానాలు మారాలి. పవన్ కళ్యాణ్ వస్తున్నారని ఈ ప్రాంతంలో అధికారులు అప్పటికప్పుడు హడావుడిగా ధాన్యం కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు వేగం పెరగాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి" అన్నారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్, పిఎసి సభ్యుడు పితాని బాలకృష్ణ, కొత్తపేట ఇంఛార్జిబండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పి గన్నవరం నియోజకవర్గంలోని రాజులపాలెం గ్రామంలో పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.