జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓటు విలువ నాటు కోడి పెట్ట విలువలా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మంచి చెప్పాలంటే సినిమాల్లో రెండున్నర గంటలు చాలని.. కాని నిజ జీవితంలో మాత్రం 20 ఏళ్లు పడుతుందని.. అందుకే మరో 25 ఏళ్లు రాజకీయాల్లో తాను ఉంటానని పవన్ స్పష్టం చేశారు. మార్పు అనేది ఒక పూటలో రాదని.. ఆశయం, సహనం ఉంటేనే అనుకున్నది సాధించగలమని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రాన్ని 40 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు టీడీపీ పాలించాయని.. ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని పవన్ కోరారు. యువతే జనసేన పార్టీకి ఇంధనమని.. వారి శక్తికి స్థానిక నాయకుల అనుభవం తోడైతే రాష్ట్రంలో జనసేన బలంగా పాతుకుపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో సరికొత్త రాజకీయ మార్పు తీసుకొస్తామని నమ్మి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తాను స్వాగతం పలుకుతున్నానని ఈ సందర్భంగా పవన్ చెప్పారు. 


దోపిడి, లంచగొండితనం లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేసి రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడం సాధ్యమేనని.. జనసేన ఆ దిశగానే ప్రయత్నిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. యువశక్తిపై తనకు విశ్వాసం ఉందన్నారు. జనసేన ప్రశ్నించే పార్టీ మాత్రమే కాదని.. పాలించే పార్టీ అని కూడా ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యలను తాను తీర్చలేకపోవచ్చు కానీ.. పబ్లిక్ పాలసీల రూపంలో అందరికీ భద్రత కలిగిన సమాజాన్ని నిర్మించగలనని హామీ మాత్రం ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.