విశాఖలో డీసీఐ సమస్యపై పవన్ `గళం`

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)ను ప్రైవేటీకరించడం పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ విశాఖలో తన గళం వినిపించారు. విశాఖలో గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను ఆయన పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్‌కు నివాళులు అర్పించాక మాట్లాడిన పవన్ కళ్యాణ్ స్థానిక నేతలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్‌లపై విమర్శలు కురిపించారు. ప్రజల పట్ల బాధ్యత లేని వారికి 2019 ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. డీసీఐ సమస్యకు తన మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్, ట్విట్టర్‌లో మోదీకి పంపిన లేఖను కూడా పోస్టు చేశారు.
ఈ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ మాటల్లోని కొన్ని విషయాలు మీకోసం..
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు నాకు బంధువులు కారు. ప్రజలే నాకు బంధువులు, స్నేహితులు.
నాకు భయం లేదు. ధైర్యం ఉంది. సమస్యల నుండి నేను పారిపోయే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఇతర నాయకుల్లా బాధ్యతల నుండి తప్పించుకు తిరగను.
క్రిందటి ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తే గెలిచినవారు ఇప్పుడు నేను ఎవరో కూడా తెలీదంటున్నారు. అయినా బాధపడను.
నిర్మాణాత్మక రాజకీయాలు చేసేవారికే నా మద్దతు. పదవి లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడాలన్నదే నా అభిమతం. జగన్ ఇప్పుడే డీసీఐ కార్మికులకు మద్దతు ప్రకటించాలి. ఏదైనా ఇబ్బంది గురించి ప్రజలు మాట్లాడితే.. ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కారం చేస్తాను అనే వారు నాకు నచ్చరు.
ప్రభుత్వ వైఖరి చూస్తుంటే.. విశాఖ స్టీల్, ఎయిరిండియాను కూడా పైవేటు వ్యక్తులకు అప్పగించేలా ఉన్నారు.
డీసీఐ సమస్యపై ప్రధాని మోదీకి లేఖ రాశాను. డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ఎందుకు ప్రైవేటీకరించకూడదో అన్న విషయాన్ని అందులో తెలిపాను. అలాగే డీసీఐకి చెల్లించాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరాను. సమస్యను పరిష్కరిస్తారా? లేదా? అన్నది ఇక వాళ్లిష్టం.
<