వైసీపీ ప్రభుత్వం, ప్రజల నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏపీలో ప్రభుత్వం సబ్సీడీపై రూ.25కే కిలో ఉల్లి అందిస్తున్న క్రమంలో తిరుపతిలోని ఓ రైతు బజార్ వద్ద ఉల్లిని కొనుగోలు చేసేందుకు జనం బారులు తీరినట్టుగా ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన వార్తా కథనంలోని ఫోటోను ట్విటర్ ద్వారా పంచుకున్న పవన్ కల్యాణ్.. ఏపీలో నిత్యావసరాలను అందుబాటులో ఉంచడంలో ఏపీ సర్కార్ విఫలమైందంటానికి ఇదే తార్కాణం అంటూ విమర్శించారు. అంతేకాకుండా ఉల్లి ధరల పెంపును ప్రస్తావిస్తూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేనాని పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు, కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు. అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా, అని ఉల్లి ధరలు పెంచేశారంటూ పవన్ ఆరోపించారు.



అంతేకాకుండా ఉల్లి ధరల పెంపును నిరసిస్తూ ఓ ఔత్సాహికుడు రూపొందించిన ఫన్నీ వీడియోను సైతం పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా రూపాయల మాదిరిగా కరెన్సీ రూపంలో చలామణి అవుతోందంటూ పవన్ తన వీడియో ద్వారా సెటైర్లు వేశారు.