సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ అభిమానులమని చెప్పుకుంటూ పలువురు టీవీ ఛానల్స్‌కి ఫోన్ చేసి దూషణలకు పాల్పడుతున్నారని కొన్ని జర్నలిస్టు సంఘాలు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన ట్విటర్‌లో మీడియా సంస్థలను టార్గెట్ చేస్తూ చేసిన పోస్టుల స్క్రీన్ షాట్లను జర్నలిస్టు సంఘాలు పోలీసులకు అందజేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పలు టీవీ ఛానళ్ల అధినేతలను పవన్ దూషించిన వీడియోలను కూడా వారు పోలీసులకు అందించారు. వాటిని ఆధారాలుగా తీసుకున్న పోలీసులు పవన్ కళ్యాణ్ పై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించిన తదుపరి దర్యాప్తుకు కూడా పోలీస్ అధికారులు ఆదేశించినట్లు సమాచారం.


శ్రీరెడ్డి తన తల్లిని దూషించిన వీడియోలను పదే పదే టీవీ ఛానళ్లు ప్రసారం చేయడంపై పవన్ కళ్యాణ్ మండిపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఫిలిం ఛాంబర్ వద్దకు చేరి మా అసోసియేషన్ సభ్యులను కూడా కలిసి మాట్లాడారు. తర్వాత తన ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు, వీడియోలు పెట్టారు. ఆ పోస్టులలో పలు టీవీ ఛానళ్ల అధినేతలను టార్గెట్ చేసి వ్యంగ్య అస్త్రాలు కూడా సంధించారు.


ఆ టీవీ సంస్థల అధినేతలపై చట్టపర్యమైన చర్యలు తీసుకోనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తీరును కొన్ని మీడియా సంస్థలు తప్పు పట్టాయి.