దేశ రాజధానిలో మళ్లీ కాలుష్య భూతం ఆవహించింది. నగరాన్ని వణికించే  స్థాయిలో పొగమంచు మరోసారి కమ్మేస్తోంది. ఇప్పటికే వాయు నాణ్యతా సూచి అధ్వాన్న స్థాయికి చేరింది. ఈ పొగమంచులో జనాలు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి నెలకొంది.ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ 201గా నమోదైందని కాలుష్య నియంత్రణా సంస్థ ప్రకటన బట్టి చూస్తే ఢిల్లీలో పరిస్థితి ఎంత అధ్వాన్న స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా పరిస్థితి నేపథ్యంలో సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ఢిల్లీలో పొల్యుషన్ కంట్రోల్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఢిల్లీకి చుట్టుపక్కల ప్రాంతాల్లోని పొలాల్లో రైతులు పంట చేతికందిన తరువాత దాన్ని తగులబెడుతుంటే, ఆ పొగలు దట్టమైన కాలుష్య మేఘాలుగా మారి ఢిల్లీని చుట్టుముడతాయన్న సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానాల రైతులు పొలాల్లో చెత్తను తగులబెట్టడం వంటి చర్యల కారణంగా న్యూఢిల్లీలో వాయు నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోందనే విశేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నాసా తీసిన చిత్రాల్లో వరి గడ్డిని తగులబెడుతున్న దృశ్యాలు కనిపించడం గమనార్హం. 



తాజా పరిస్థితిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ కాలుష్యం కారణంగా నగర ప్రజలు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వాయు నాణ్యతను పెంచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని..డీజిల్ జనరేటర్లను ఆపివేయడం, మెట్రో రైలు సర్వీసులను పెంచడం తో పాటు మరికొన్ని అత్యవసర చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే ఇరుగు, పొరుగున ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాలుష్యంపై ఇప్పటికే చర్చించామన్నారు. ఇదే అంశంపై కేంద్రంతో చర్చిస్తున్నామని..త్వరలోనే దినికి పరిష్కారం లభిస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.