గడిచిన వారం రోజులుగా కాస్త నెమ్మదించిన రుతు పవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో తాజా వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి మాట్లాడుతూ.. రుతు పవనాల ప్రభావంతో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఏపీలోనూ రుతుపవనాల ప్రభావం కనిపించవచ్చన్న ఆయన.. క్రమక్రమంగా వర్షాలు పెరిగి నెలాఖరు వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా లేకపోలేదని వై కే రెడ్డి చెప్పారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో 2.1 కిలో మీటర్ల నుంచి 4.5 కిలో మీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటమే ఈ వాతావరణ మార్పులకు ఓ కారణం అని వైకే రెడ్డి తెలిపారు. 


ఇదిలాఉండగా, ఈ రెండు రోజులపాటు తెలంగాణలో ఎండల తీవ్రత సైతం అధికంగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాయవ్యం నుంచి వీస్తున్న పొడి గాలులతో రాష్ట్రంలో వాతావరణం వేడెక్కి ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల చోటుచేసుకున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.