రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌‌తో రాపాక కొద్దిసేపు భేటీ అయినట్లు తెలుస్తోంది. రాజోలు నియోజకవర్గం నుండి రాపాకకు జనసేన పార్టీ టికెట్ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఈ విషయానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం. గతంలో జనసేన నాయకులు కొందరు రాజోలుకు వెళ్లి స్వయంగా రాపాకను కలిశారని కూడా వార్తలు వచ్చాయి.  తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని చింతలమోరి గ్రామానికి చెందిన రాపాక.. 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.


అయితే 2014లో ఇదే ఎమ్మెల్యే సీటును తెలుగుదేశం పార్టీ తరఫున గొల్లపల్లి సూర్యరావు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో వైఎస్సార్సీపీలో కూడా చేరాలని భావించారు రాపాక. మళ్లీ మనసు మార్చుకొని ఇప్పుడు జనసేన పార్టీలో తన అనుచరుల సమక్షంలో చేరారు. మల్కిపురంలోని కేవలం ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్న రాపాక.. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరి ఆ తర్వాత డిస్ కంటిన్యూ చేశారు. గతంలో ఆయనపై కంచికర్ల పోలీసు స్టేషనులో కేసులు నమోదయ్యాయి. గతంలో రాపాక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పాదయాత్ర కూడా చేశారు.