ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆర్పీ ఠాకూర్ ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖకు డీజీగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆర్పీ ఠాకూర్ ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖకు డీజీగా వ్యవహరిస్తున్నారు. ఆయన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివిన ఠాకూర్ గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ఏఎస్పీగా, పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీగా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ తర్వాత జోనల్ హైదరాబాద్ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా కూడా వ్యవహరించారు. 2016 సంవత్సరం నుండి ఆర్పీ ఠాకూర్ అవినీతి నిరోధక శాఖకు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఠాకూర్ నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా అదనపు ఎస్పీగా బాధ్యతలు వహించారు.
ఇటీవలే పదవీవిరమణ చేసిన డీజీపీ మాలకొండయ్య స్థానంలో ఆర్పీ ఠాకూర్ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఉత్తమ పోలీస్ ఆఫీసరుగా ఆర్పీ ఠాకూర్ అనేక పురస్కారాలు అందుకున్నారు. 2003లో ఇండియన్ పోలీస్ మెడల్, 2004లో ఏఎస్‌ఎస్పీ మెడల్ సాధించిన ఠాకూర్, 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలకు గాను పతకం కూడా కైవసం చేసుకున్నారు.