RRRపై అల్లూరి అభిమాని ఫిర్యాదు
ఆర్ఆర్ఆర్పై అల్లూరి అభిమాని ఫిర్యాదు
ఆర్ఆర్ఆర్ సినిమా కథ పూర్తిగా కల్పితమేనని దర్శకుడు రాజమౌళి గతంలోనే ఓ మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. 1920 కాలంలో అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారనేది చరిత్రలో నమోదు కాలేదని, ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఉంటే ఎలా ఉండేదనే అంశాన్ని ఊహించి ఈ కథను రూపొందించామని రాజమౌళి ప్రకటించారు. భారత దేశానికి స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథపై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం దర్శకుడు రాజమౌళికి తగదని వీరభద్రరావు హితవు పలికారు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం జిల్లాలోని పాండ్రంకిలో జన్మించి కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న బ్రిటీషు సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారని, ఇక కొమురం భీం విషయానికొస్తే.. 1901లో జన్మించిన ఆ వీరుడు 1941లో మరణించారని చరిత్ర చెబుతోంది. అటువంటప్పుడు ఈ ఇద్దరికీ స్నేహం ఎలా ఏర్పడిందో అర్థం కావడం లేదని.. చరిత్రలో లేని విషయాలతో చరిత్రను వక్రీకరించడం తగదని వీరభద్ర రావు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సీపట్నం ఆర్డీవోకు వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చారు.
నర్సీపట్నంతో అల్లూరికి వీడదీయలేని అనుబంధం ఉందని, భవిష్యత్తులో అల్లూరి జిల్లా ఏర్పాటు చేస్తే నర్సీపట్నం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వీరభద్ర రావు తన వినతి పత్రంలో డిమాండ్ చేశారు.