ప్రముఖ తెలుగు రచయిత దేవీ ప్రియను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. వైవిధ్యమైన కవిత్వంతో తెలుగు సాహిత్య వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఆయన రచించిన గాలిరంగు కవితా సంపుటికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. సమకాలీన రాజకీయ, సాంఘిక స్థితిగతుల్ని కవిత్వం ద్వారా చెబుతూ ‘రన్నింగ్‌ కామెంటరీ’ కవిగా పేరొందిన దేవీప్రియ 1951 ఆగస్టు 15 తేదీన గుంటూరు జిల్లాలో జన్మించారు. ఈయన అసలు పేరు షేక్ ఖాజాహుస్సేన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో దేవిప్రియ ఒకరు.సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు వ్రాసిన దేవిప్రియ,  దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు కూడా రాసారు. మనోరమ పత్రిక స్థాపకుడిగా, హైదరాబాద్ మిర్రర్ ప్రధాన సంపాదకులుగా కూడా దేవిప్రియ సుపరిచితులు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు రచనా లోకానికి, పాత్రికేయ రంగానికి సేవలందిస్తున్న సుప్రసిద్ధుడైన దేవీప్రియ అమ్మచెట్టు, గరీబుగీతాలు, నీటిపుట్ట, అరణ్యపురాణం వంటి అనేక రచనలు చేశారు.