YS Avinash Reddy's CBI Investigation: అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌ రెడ్డిపై సీబీఐ చేస్తున్న విచారణతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టంచేశారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ కేసు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఎక్కడా జోక్యం చేసుకోలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ.. '' వైయస్ అవినాష్‌ రెడ్డి ఒక బాధ్యత కలిగిన ఎంపీగా వ్యవహరిస్తున్నారు. సీబీఐ విచారణ నుంచి అవినాష్ ఎక్కడా తప్పించుకోలేదు. ఇప్పటికే ఆరేడుసార్లు సీబీఐ పిలిచినప్పుడల్లా సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతూ వచ్చారు. తన తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని సీబీఐకి చెప్పారు. తన తల్లి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాను విచారణకు వచ్చేందుకు మరికొంత గడువు ఇవ్వాలని సీబీఐని కోరారు కానీ విచారణకు రానని ఎక్కడా చెప్పలేదు కదా అని ప్రశ్నించారు. 


అలాగే, అవినాష్ రెడ్డి అరెస్టుకు కర్నూలు ఎస్పీ సహకరించడం లేదని టీడీపీ నేతలు ఆరోపించడం ఊహాగానాలను ప్రచారం చేయడమే అవుతుంది. అవినాష్ రెడ్డి విషయంలో ఏమిటీ అన్యాయం అని అనుకున్న వారు ఆయనకు మద్దతుగా కర్నూలుకు వస్తున్నారే తప్ప ఇందులో ఇంకేమీ లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.


ఇదిలావుంటే, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు అయిన అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోవడం వల్ల వైస్సార్సీపి పార్టీకే తీవ్ర నష్టం ఉందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కడప టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి అభిప్రాయపడ్డారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీటెక్ రవి, శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. " అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోతే వైస్సార్సీపి పార్టీకే నష్టం అని తెలిసి కూడా పులివెందుల వైసీపీ బ్యాచ్, నాయకులు కాపాడే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పాలి" అని ప్రశ్నించారు. సీబీఐ అరెస్టు చేయకుండా 25వ తేది వరకు వాయిదా వేయగలిగితే.. ఆ తర్వాత ఎలాగైనా తమ పలుకుబడిని ఉపయోగించుకుని సీబీఐ డైరెక్టర్‌ను మారిస్తే అరెస్ట్ అనేదే ఉండదు అని పులివెందులలో చర్చించుకుంటున్నారు అని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. 
ఏదేమైనా వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు వైఎస్సార్సీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది అని.. ఢిల్లీలోనూ పార్టీ పెద్దలు అదే పనిపై ఉన్నారని బీటెక్ రవి, శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. అంతే కాకుండా ఒకవేళ అవినాష్ రెడ్డి ఈ కేసులో జైలుకు పోతే.. 2 వేల రూపాయల నోట్లు మార్చుకోవాలంటే ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా.. అందుకే అరెస్టును అడ్డుకునేందుకు అన్నివిధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఎద్దేవా చేశారు.