ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో శుక్రవారం ఓ విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు బందోబస్తు విధుల్లో భాగంగా విధి నిర్వహణలో ఉన్న చిత్తూరు జిల్లా ఏర్పేడు ఎస్‌ఐ వెంకటరమణ (38) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వచ్చారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం శ్రీశైలంలో జలసిరికి హారతి ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనేందుకు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లారు. చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వస్తున్నారనే సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పేడు ఎస్‌ఐ వెంకటరమణ విమానాశ్రయం వద్ద బందోబస్తు విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వెంకటరమణకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. 


బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి వెంకటరమణను తిరుపతి నగర శివార్లలోని నారాయణాద్రి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. నారాయణాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ తుదిశ్వాస విడిచారు. ఎస్ఐ వెంకటరమణ హఠాన్మరణం గురించి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.10 లక్షలు ఆర్థికసహాయం అందివ్వనున్నట్టు ప్రకటించారు.