Krishnakumar Kunnath Death: ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ హఠాన్మరణం బాధ కలిగించిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కేకే కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. సినీ సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యేక బాణీతో కెకె శ్రోతలను ఆకట్టుకున్నారని... ఆయన పాడిన పాటలు సంగీతాభిమానుల్లో సుస్థిరంగా నిలిచాయని అన్నారు. ఈ మేరకు బుధవారం (జూన్ 1) పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంగీత కచేరీ ముగించుకొన్న కాసేపటికే ఆయన హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికరమని... తన చివరి శ్వాస వరకు ఆయన పాడుతూనే ఉన్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తన సినిమాల్లో కెకె పాడిన పాటలు సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయని అన్నారు. ఖుషీలో కెకె పాడిన 'ఏ మేరా జహా' గీతం అన్ని వయసులవారికి చేరువైందన్నారు. అలాగే, జల్సాలో 'మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా...', బాలు సినిమాలో 'ఇంతే... ఇంతింతే...', జానీ సినిమాలో 'నాలో నువ్వొక సగమై...', గుడుంబా శంకర్ సినిమాలో 'లే లే లే లే...' పాటలు కెకె పాడారని... అవి సంగీతాభిమానులు హమ్ చేసుకునేలా నిలిచిపోయాయని అన్నారు. 


కోల్‌కతాలో కేకే హఠాన్మరణం :


కోల్‌కతాలో నిర్వహిస్తున్న మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొనేందుకు కృష్ణకుమార్ కున్నత్ ముంబై నుంచి అక్కడికి వెళ్లారు. మంగళవారం (మే 31) రాత్రి ఆ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈవెంట్ తర్వాత హోటల్‌కు వెళ్లిన కాసేపటికే కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే కేకే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఆడిటోరియంలో పాటలు పాడుతున్నప్పుడే కెకె అస్వస్థతకు గురయ్యారని కెకె మేనేజర్ రితేశ్ భట్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. దీంతో మధ్యలోనే ఆడిటోరియం నుంచి హోటల్‌కు వెళ్లినట్లు అతను పోలీసులతో చెప్పడం గమనార్హం. కారులో వెళ్తున్నప్పుడు తనకు చాలా చలిగా ఉందని... ఏసీ ఆఫ్ చేయమని చెప్పినట్లు తెలిపారు. హోటల్‌ వద్దకు వెళ్లాక పలువురు ఫ్యాన్స్‌తో ఆయన ఫోటోలు కూడా దిగాడని... గదిలోకి వెళ్లిన కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయారని చెప్పారు. కేకే మృతిపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.