గూగుల్‌కు నచ్చిన తెలుగమ్మాయి, ఏకంగా రూ.1.20 కోట్ల వార్షిక వేతనం
హైదరాబాద్: మెరికల్లాంటి యువతకు అవకాశాలకు కొదవ లేదు.. దీనికి మంచి ఉదాహరణ స్నేహారెడ్డి. కృత్రిమ మేధ అంశమై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయగల సత్తా ఉన్నవారిని గుర్తించేందుకు గూగుల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. దేశ నలుమూల నుంచి సత్తా ఉన్న యువతి, యువకులు ఆన్ లైన్లో నిర్వహించి ఈ ఇంటర్యూను ఫేస్ చేశారు. చివరకు గూగుల్ సంస్థ అత్యంత ప్రతిభావంతులైన ఐదుగురిని ఎంపిక చేసింది. ఒక్కొక్కరికి రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాలిచ్చింది. వారిలో తెలుగమ్మాయి స్నేహారెడ్డి ఉండటం గమనార్హం.
ఇంటర్వ్యూలో అదరగొట్టింది
స్నేహారెడ్డి పూర్తి పేరు కుడుగుంట స్నేహారెడ్డి. ఆమె స్వస్థలం వికారాబాద్. ఆమె హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇటీవలే కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేసింది. చదువుతో పాటు భిన్న అంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి స్నేహరెడ్డి..ఇటీవలె జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ఇటీవలె జరిగిన గూగుల్ ఇంటర్వ్యూకు హాజరైన స్నేహారెడ్డి కాన్ఫిడెంట్ గా సమాధానాలు ఇచ్చింది. స్నేహరెడ్డి తెలివితేటలకు మెచ్చి గూగుల్ సంస్థ భారీ వేతనంతో కూడిన ఉద్యోగం ఇచ్చింది. తెలుగమ్మాయా..మాజాకా !!
స్నేహారెడ్డి రియాక్షన్
తనకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన గూగుల్ సంస్థకు స్నేహారెడ్డి కృతజ్ఞతలు తెలిపింది. తన విజయం వెనుక తల్లిదండ్రులు,గురువుల ప్రోత్సాహం ఉందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఫేస్‌బుక్‌తోపాటు పలు పెద్ద సంస్థల్లో తనకు అవకాశాలు వచ్చినా.. పరిశోధనలు చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే తాను గూగుల్‌ను ఎంపిక చేసుకున్నా అని స్నేహారెడ్డి పేర్కొంది.