ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. వడగాడ్పులు విపరీతంగా వీస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఎండ‌ల తీవ్రత మ‌రింతగా పెరిగిపోయాయి. ఉదయం 9 గంటలయితే చాలు భానుడి భగభగలు మొదలవ్వడంతో రోడ్డుపైకి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు.  ఏపీలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. కడపలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రామగుండం, ఆదిలాబాద్ లలో 42, హన్మకొండ, కరీంనగర్ 41, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ 40, గుంటూరు, ప్రకాశం, కర్నూలు , వైజాగ్ లలో  39డిగ్రీలకు ఉష్ణోగ్రతలు మంగళవారం నాడు నమోదయ్యాయి.


రానున్న నాలుగైదు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో 44 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. మిగిలి జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు ఉండొచ్చంటున్నారు. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో ఎండలను దృష్టిలో పెట్టుకొని జనాలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు రావొద్దని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.