విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కోళ్లపందేల్లో పక్షి కాళ్లకు కట్టేందుకు ఉపయోగించే కత్తితో యువకుడు దాడి చేయగా.. ఆ ఘటనలో జగన్‌కు గాయాలయ్యాయి. తర్వాత వెనువెంటనే జగన్‌‌కు ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్ నగరానికి తరలించారు. తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయం నుండి ఆసుపత్రికి తీసుకెళ్లారు. జగన్‌ను పరిశీలించిన వైద్యులు ఆయనకు భుజంపై  గాయమైందని తెలిపారు. కత్తిపోటు వల్ల కండరాలకు దెబ్బ తగిలిందని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఆయనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ప్రస్తుతం జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కత్తికి ఏవైనా విష పదార్థాలు పూసారా? లేదా? అన్న విషయం తెలుసుకోవడానికి ఆ హత్యాయుధాన్ని లాబొరేటరీ టెస్టులకు పంపించినట్లు తెలిపారు. శస్త్రచికిత్సలో భాగంగా జగన్‌కు భుజంపై తొమ్మిది కుట్లు పడ్డాయని.. అయితే ఆయన ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న విషయం పై ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదని వైద్యులు అన్నారు. 


కాగా.. ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగాక జగన్.. ట్విటర్ వేదికగా తన అభిమానులకు సందేశాన్ని పంపించారు. తనకు శస్త్రచికిత్స జరిగాక ఆరోగ్యంగానే ఉన్నానని.. తనకోసం ఎవరూ ఆందోళనలు చేయవద్దని తెలిపారు. దేవుడి దయ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానం, ఆశీస్సులు తనకు ఎప్పుడూ రక్షణగానే ఉంటాయని ఆయన తెలిపారు. తనను భయపెట్టడానికి ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడినా తాను ఇంకా బలవంతుడిగానే మారతాడు తప్పితే.. వెనుకడుగు వేయడని ఆయన ట్వీట్ చేశారు.