అమరావతి: వైఎస్ జగన్ రేపు గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా  ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు అప్పట్లో వైఎస్ జగన్‌ను కూడా ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరుకాలేదు. అయితే, అప్పుడు చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకాని జగన్ తాజాగా తన ప్రమాణస్వీకారోత్సవానికి మాత్రం చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ ఆహ్వానించినట్టు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. మరి జగన్ ఆహ్వానాన్ని మన్నించి చంద్రబాబు రేపటి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతారా లేక ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారా అనేదే ప్రస్తుతం చర్చనియాంశంగా మారింది. 


ఇదిలావుంటే జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.