ఏడేళ్ల పాటు పన్ను మినహాయింపు; కశ్మీర్ కు ఓకే ..మరి ఏపీ పరిస్థితి ఏంటి ?
ఏపీలోనూ కశ్మీర్ తరహా పన్ను మిహాయింపు డిమాండ్ వినిపిస్తోంది.
ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ను రాష్ట్రాన్ని విభిజించి ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోడీ సర్కార్..... కశ్మీర్, లడఖ్ ప్రాంతాల పునర్నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తోంది. అక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహించే క్రమంలో ఏడేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో అవసరమనుకుంటే జీఎస్టీని కూడా మినహాయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో కశ్మీర్‌లో పెట్టుబడుల సదస్సు నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో పాటు కశ్మీర్, లడఖ్ యువతకు సరిహద్దు దళాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
వీటితో పాటు 7వ వేతన సంఘం సిఫార్పుల ప్రకారం ఉద్యోగులకు కొత్త జీత భత్యాలు, 3 నుంచి 5 వరకు ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపుకు చర్యలు, కార్పోరేట్ ఆస్పత్రులు, విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక, 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు వీలుగా విద్యాహక్కు చట్టఅమలు, సాహస, ఆధ్యాత్మిక , పర్యటక ప్రాకేజీలు ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు కశ్మీర్‌లో పరిస్థితుల సమగ్ర అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని కూడా పంపనున్నట్టు తెలుస్తోంది.
సరిహద్దు ప్రాంతమైన కశ్మీర్ విషయంలో పన్ను మినహాయింపు ఇస్తున్నారు సరే.. మరి భారత దేశంలో అంతర్గాభమైన మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. విభజన తీరుతో రోడ్డున పడ్డ మన పరిస్థితి ఏంటి..? అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహించే చర్యలు ఏవి..? మనకు పన్ను మినహాయింపులు ఉండవా ? మనకు ఎలాంటి ప్రొత్సహకాలు ఇస్తున్నారు ? ఉపాధి కల్పనకు ప్రణాళికలు ఏవి ? మన పరిస్థితుల అధ్యయనానికి ఎవరు వస్తారు ? పనిలో పనిలో గా కశ్మీర్ తరహా ఏపీ పరిస్థితిని అధ్యయనం చేసి ఇక్కడ కూడా పన్ను మినహాయింపులు, ప్రోత్సహకాలు ఇచ్చి ఏపీని ఆదుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో కేంద్రం ఏ మేరకు స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.