విజయవాడ: ఏపీలో ఇసుక కొరత ఏర్పడిన కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఏపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఏకంగా సర్కార్‌కి వ్యతిరేకంగా నిరసన దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణ కార్మికుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి వారికి తాము ఉన్నామనే భరోసా ఇచ్చే లక్ష్యంతో చంద్రబాబు చేపట్టిన ఈ దీక్షకు బీజేపి, జనసేన పార్టీలు సైతం తమ మద్దతు ప్రకటించాయి. విజయవాడలోని ధర్నాచౌక్‌లో జరుగుతున్న ఈ నిరసన దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. 


ఇదిలావుంటే, విజయవాడలో ఇసుక కొరత సమస్యపై చంద్రబాబు చేస్తున్న దీక్షకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి దీక్షకు దిగారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అవలంభించిన విధానాల వల్లే ప్రస్తుతం ఇసుక కొరత ఏర్పడిందని.. ఆ తర్వాత ఇసుక సమస్యను తీర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో చర్యలు తీసుకున్నారని పార్థసారథి ఈ వేదికపై నుంచే ప్రపంచానికి చాటిచెప్పాలని పూనుకున్నారు. ఒకే అంశంపై వేర్వేరు అభిప్రాయాలతో అధికారపక్షం, ప్రతిపక్షం పోటాపోటీ దీక్షలకు దిగడంతో విజయవాడలో ఒకింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.