ఎన్డీయే నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్న టీడీపీ.. మోడీ సర్కారును ఇరుకునపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందనే కారణంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ నిర్ణయం తీసుకుంది. అనంతరం టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు అవిశ్వాసం నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమయంలో ఎంపీలు సమన్వయంతో ఉండాలని సూచించారు.  కాగా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఫ్లోర్ లీడర్ తోట నరసింహన్ లోక్ సభ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీకి మద్దతిచ్చేదెవరు ?
అవిశ్వాస తీర్మానం కోసం కనీసం 40 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే టీడీపీకి ఎవరెవరు మద్దతిస్తారనే విషయంలో ఆసక్తిగా నెలకొంది. వాస్తవానికి వైసీపీయే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావించింది. అయితే ఆ పార్టీతో కలిసి అవిశ్వాసం పెడితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది చంద్రబాబు వాదన. అందుకే తామే రంగంలోకి దిగి అవిశ్వాసం పెడితే బాగుంటుందని భావించిన చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


దేశ రాజకీయ పార్టీల చూపు టీడీపీ వైపు 
ప్రస్తుత తరుణంలో కేంద్రంపై అవిశ్వాసం పెడితే దేశ వ్యాప్తంగా రాజకీయపార్టీల చూపు టీడీపీపై ఉంటుందనేని చంద్రబాబు ఆలోచన. అప్పుడు థర్డ్ ఫ్రంట్ రూపకల్పన చేసేందుకు కీలక పాత్ర పోషించడానికి వీలు కలుగుతుంది. టీడీపీ అవిశ్వాసం పెడితే వైసీపీని కూడా ఇరికించవచ్చనేది చంద్రబాబు వ్యూహం. మద్దతిస్తే సరి..లేదంటే ప్రజా కోర్టులో వైసీపీని దోషిగా చూపించాలని టీడీపీ వ్యూహ రచన సిద్ధం చేసుకుందని పలువురు రాజకీయవేత్తలు అంటున్నారు.


మీరు కూడా ఈ క్రమంలో మోడీ సర్కార్ పై అవిశ్వాసం పెడితే.. ప్రయోజనం ఉంటుందా లేదా? అన్న విషయంపై మీ అభిప్రాయలు మాతో పంచుకోండి. ఈ క్రింది ఫేస్ బుక్ పేజీ ద్వారా జీ న్యూస్ పోల్‌లో పాల్గొనండి