టీడీపీ నిరసనల్లో అపశ్రుతి; మంటల్లో చిక్కుకొని గాయాలపాలైన టీడీపీ నేత
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తోంది.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపట్టింది. బుధవారం జిల్లా కేంద్రాల్లో టీడీపీ కార్యకర్తలు విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కానీ విజయనగరంలో వైఎస్సార్ పార్టీ నేత విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను కాల్చబోయి ..అదే మంటల్లో చిక్కుకొని ఓ టీడీపీ నేత గాయాలపాలయ్యారు.
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా వేపాడ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నీలకంఠరాజపురం మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేచలపు జగ్గుబాబు పాల్గొన్నారు. ‘‘జగన్, విజయసాయిరెడ్డి ఆర్థిక దొంగలు’’ అంటూ నినాదాలు చేశారు. అయితే విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మకు నిప్పంటించే క్రమంలో జగ్గుబాబు మంటల్లో చిక్కుకున్నారు. ఆ సమయంలో గాలి మరింత ఉధృతంగా వీయడంతో మంటలు వెంటనే అదుపులోకి రాలేదు. మంటలు అదుపుకొని వచ్చేసరికి ఆయన ముఖం, మెడ, ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం 108 అంబులెన్స్ లో జగ్గుబాబును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు.