గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్ జగనే అవినీతి రాజ్యానికి రాజు అని ఆరోపించిన అశోక్ బాబు.. వైఎస్సార్సీపీ వాళ్లే అవినీతి గురించి మాట్లాడుతుండటం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇవాళ గుంటూరులో అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. గృహ నిర్మాణం విషయంలో షేర్ వాల్ టెక్నాలజీ సరైనది కాదని వైఎస్సార్సీపీ చెప్పగలదా అని సవాల్ విసిరారు. నిరుపేదలు నూతన గృహాల్లో ఉండకూడదనేది వైఎస్ జగన్ కోరికా అని అశోక్ బాబు నిలదీశారు.


ఈ సందర్భంగా టీడీపి హయాంలో పథకాల అమలులో అవినీతి చోటుచేసుకుందన్న వైఎస్సార్సీపీ ఆరోపణలను అశోక్ బాబు తిప్పికొట్టారు. రాజీవ్ గృహాకల్పపై కూడా విచారణ చేస్తే బాగుంటుందని హితవు పలికిన అశోక్ బాబు.. 2004 నుంచి 2019 వరకు విచారణ జరిపిస్తే టీడీపీ స్వాగతిస్తుందని అన్నారు. టీడీపి ఎమ్మెల్సీ అశోక్ బాబు చేసిన ఈ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఏమని స్పందిస్తుందో మరి.