విభజన హామీల అమలు కోసం టీడీపీ ఎంపీలు ఆందోళన తీవ్రతరం చేశారు. వర్షాకాల సమావేశాల చివరిరోజు కావడంతో ఆందోళనను ఉధృతం చేశారు. ప్లకార్డులు చేతబట్టి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. రోజుకో రీతిలో వేషం వేస్తూ నిరసన వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ఈరోజు విచిత్ర వేషధారణలో నిరసన తెలియజేశారు. ఎన్ని వేషాలేసినా ప్రధాని మోదీ మనసు కరగడం లేనందునే తప్పక హిజ్రా వేషం వేశానన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిజ్రా వేషధారణలో ఎంపీ శివప్రసాద్ మోదీ బావా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ పాట పాడారు. ప్రధాని మోదీ ఏపీకి ద్రోహం, అన్యాయం చేస్తున్నారంటూ శివప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇచ్చిన హామీలను మరిచిపోవడం దారుణమని అన్నారు. అటు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తదితరులు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం ఎంపీల వద్దకు వచ్చి అభినందించారు. సోనియాగాంధీ రోజుకో వేషధారణలో చేస్తున్న ఎంపీ శివప్రసాద్‌ను నిరసన ప్రదర్శనలు బాగున్నాయంటే ప్రత్యేకంగా అభినందించారు.


అనంతరం టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్నే బీజేపీ కూడా చేస్తోందని అన్నారు. అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే విశాఖ కేంద్రంగా జోన్‌ ఇవ్వలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. రైల్వేజోన్‌ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. 18రోజులుగా ఆందోళన చేస్తున్న కేంద్రంలో కదలిక రాలేదని ఎంపీ మురళీమోహన్‌ అన్నారు.