YS Sharmila YS Vijayamma Letter: ఆస్తిపాస్తులపై వైఎస్‌ఆర్‌ కుటుంబంలో తీవ్ర అలజడి మొదలైందని జగన్‌ కేసుతో బహిర్గతమైంది. తమపై కేసు వేసిన వైఎస్‌ జగన్‌ సొంత చెల్లెలు, తల్లి విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమ ఆప్యాయతలతో బదిలీ చేసిన ఆస్తులను ఎలా అడుగుతారని ఘాటుగా లేఖ రాశారు. తండ్రి వైఎస్సార్‌ ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటుంటే జగన్‌ మాత్రం ఆస్తులపై కన్నేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్‌కు తల్లీకూతుళ్లు రాసిన లేఖ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఆ లేఖను తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం కలకలం రేపింది. జగన్‌ వ్యక్తిగత విషయాలపై టీడీపీ స్పందించడం చర్చనీయాంశమైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sharada Peetham: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు భారీ షాక్‌.. శారదా పీఠం 15 ఎకరాలు రద్దు


 


ఆస్తి పంపకాలపై వైఎస్‌ జగన్‌ బుధవారం కేసు దాఖలు చేయడంతో సాయంత్రం షర్మిల, విజయమ్మ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. లేఖలో జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కుటుంబ బంధానికి విలువనిస్తే జగన్‌ మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి వైఎస్సార్‌ ఆదేశాలకు తూట్లు పొడుస్తున్నారని జగన్‌పై షర్మిల, విజయమ్మ మండిపడ్డారు.

Also Read: Big Breaking: వైయస్ కుటుంబంలో ముదిరిన ముసలం.. తల్లి, చెల్లిపై కోర్టు కెక్కిన వైయస్ జగన్..


 


'మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నాని  ఆ సమయంలో మాకు హామీ ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను అంగీకరించనంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే స్పష్టంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా' అని వైఎస్‌ షర్మిల గుర్తుచేశారు.


'మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒప్పందం‌ ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఇలా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది' సంయుక్త లేఖలో షర్మిల, విజయమ్మ పేర్కొన్నారు. 'ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందం, ఎంఓయూలో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి  ఆదేశాలను  పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే' అని తెలిపారు.


'నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి, భారతి సిమెంట్స్‌లో మెజారిటీ వాటా నిలుపుకోవాలని మీరు పట్టుబడుతున్నారు కాబట్టి. ఇప్పటికవరకు మీదే పైచేయి కాబట్టి నన్ను పూర్తిగా తొక్కివేశారు. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం మేము ఒక పరిష్కారానికి అంగీకరించాం. మీరు నాకు అన్నయ్య కాబట్టి, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవాలనే  ఉద్దేశంతో  నా సమాన వాటాను వదులుకోవడానికి అంగీకరించాన. ఆ విధంగా 31.08.2019న అమలు చేయబడిన ఒప్పందం ప్రకారం నాకు కొన్ని ఆస్తులు మాత్రమే కేటాయించబడ్డాయి' అని షర్మిల వివరించారు.


'ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన తండ్రి మీద మీకున్న గౌరవాన్ని తగ్గించేలా ఉంది. ఆయన ఎన్నడూ కలలో కూడా మీరు ఊహించని పని చేశారు. చట్టబద్దంగా  మీ కుటుంబసభ్యులకు  చెందాల్సిన ఆస్తులను లాక్కోడానికి  సొంత తల్లి మీద, నా మీద కేసులు పెట్టారు' అని షర్మిల, విజయమ్మ తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter