కేరళలో రానిది, తెలంగాణాలో ఎలా వస్తుంది: బీజేపీపై తెరాస మండిపాటు
స్పైస్ బోర్డు కార్యాలయమున్న కేరళలో పసుపు రైతుకు దక్కని మద్దతు ధర నిజామాబాద్‌లో స్పైస్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసినంత మాత్రన ఇక్కడి పసుపు రైతులకు మద్దతు ధర ఎలా వస్తుందని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన భీమ్‌గల్‌లో మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్ : స్పైస్ బోర్డు కార్యాలయమున్న కేరళలో పసుపు రైతుకు దక్కని మద్దతు ధర నిజామాబాద్‌లో స్పైస్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసినంత మాత్రన ఇక్కడి పసుపు రైతులకు మద్దతు ధర ఎలా వస్తుందని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన భీమ్‌గల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. స్పైస్ బోర్డు కార్యాలయాలు దేశంలో పదహారు చోట్ల ఉన్నాయన్నారు. ఇవి ఉన్న చోట్ల మద్దతు ధర రావడంలేదని గుర్తు చేశారు. వరంగల్‌లో దాదాపు ఇరవై సంవత్సరాలుగా, సికింద్రాబాద్‌లో ముప్పై సంవత్సరాలు స్పైస్ బోర్డు ఉన్నప్పటికీ, పసుపు రైతుకు మద్దతు ధర 15వేలు ఎందుకు దక్కడం లేదన్నారు. పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కానంత వరకు రైతుకు మేలు జరగదని అన్నారు.
దశాబ్దాలుగా రైతులు కోరుతున్నది పసుపుబోర్డు మాత్రమేనని గుర్తు చేశారు. వారి డిమాండ్ మేరకు కేంద్రం పసుపుబోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా మద్దతు ధర 15వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రమే పసుపును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ డిమాండ్లకు స్పందించి ఎన్నికల్లో అర్వింద్ ధర్మపురి, ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్‌పేపర్ రాసిచ్చారని గుర్తు చేశారు.
తొమ్మిది నెలలు గడిచినా.. ఎంపీ అర్వింద్ తెచ్చింది స్పైస్ బోర్డు ఆఫీసు మాత్రమేనని అన్నారు. స్పైస్ బోర్డు ఆఫీసులతో పసుపు రైతుకు మద్దతు ధర రాదని, ప్రయోజనమేమీ లేదన్నారు. పసుపుబోర్డు తెస్తానని హామీలిచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత స్పైస్ బోర్డు ఆఫీసు పేరిట జరుగుతున్న నాటకమన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా, టీఆర్‌ఎస్ పార్టీ తరపున కేంద్రం పసుపుబోర్డు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.ఇక రైతులకు కావాల్సింది పసుపుబోర్డు మాత్రమేనని అన్నారు. ఈ పసుపుబోర్డు ఏర్పాటు చేయాల్సింది కేంద్రమే కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే పసుపుబోర్డును ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ పనిని చేయాల్సింది కేంద్రమేనని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..