బాబోయ్ ఎండలు కుమ్మేస్తున్నాయ్.. బయటికి వస్తే ఖబర్దార్ !!
ఏపీలో ఎండలు హడలెత్తిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉదయ 10 గంటలు దాటాక బయటికి రావాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. మరోవైపు వేడిగాలుల తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏపీలో 42 - 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మరింత వేడి..
మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సగటున 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశలున్నాయని వెల్లడించింది. వాయువ్య భారత్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిపోతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
జాగ్రత్తలు పాటించండి...
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు నీడ పట్టునే ఉండాలనీ... ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తెలుపు రంగు లేదా తేలికపాటి రంగులున్న దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు తరచూ కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటి పానియాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే చిన్నారులు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.