విశాఖ : దక్షిణ అండమాన్‌ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు అల్పపీడనం నిలకడగా కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల 36 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) పేర్కొంది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మంగళవారం రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 


ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీకి ఎంఫాన్ తుపాన్ ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని వాతావరణ విభాగం అధికారులు అన్నారు. వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ అల్పపీడనం బలపడటం లేదని.. అందుకే ఏపీకి తుపాన్ ముప్పు కూడా లేనట్టేనని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు.