ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంపై కేంద్ర సమాచార కమీషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయల కాలంలో సమర్పించిన ఆభరణాల పరిరక్షణ విషయంలో అవకతవకలు జరిగనట్లు తమకు తెలిసిందని.. ఈ విషయం పై వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్ తెలిపారు. ఆర్కియాలజీ శాఖ నుండి తమకు అందిన సమాచారం మేరకు శాసనాల్లో పేర్కొన్న నగలకు, టీటీడీలో ఉన్న ఆభరణాలకు వ్యత్యాసం ఉందని తెలిసిందని సమాచార కమీషన్ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం.. ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కమీషనర్ తెలిపారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై అర్చకులు రమణ దీక్షితులు పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. స్వామి వారి వజ్రాన్ని బయటవారు హస్తగతం చేసుకున్నారని ఆయన తెలిపారు. అయితే తర్వాత దీక్షితుల ఆరోపణల్లో సత్యం లేదని టీటీడీ చైర్మన్ సింఘాల్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో దీక్షితులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 


అయితే తాజాగా ఆర్కియాలజీ శాఖ నుండి తమకు వచ్చిన సమాచారం మేరకు వివరణ కోరుతూ కేంద్ర సమాచార కమీషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయమై సెప్టెంబర్ 28న తుది విచారణ చేపడతామని కూడా కమీషన్ తెలియజేయడం గమనార్హం. సమాచార హక్కు చట్టం పరిధిలోకి టీటీడీ కూడా వస్తుందని.. నగల విషయంలో కూడా సమాచారాన్ని వారు బహిర్గతం చేయాల్సి ఉంటుందని కమీషన్ తెలిపింది. తిరుమల ఆలయం కూడా జాతీయ కట్టడం క్రిందకే వస్తుందని.. ఇలాంటి కట్టడాల తరఫున వాదించే హక్కు ఆర్కియాలజీ శాఖకు ఉంటుందని కూడా కమీషన్ తేటతెల్లం చేసింది.